Chandrababu: మేమంతా టీడీపీ వారసులం 3 d ago

AP : పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారం దక్కించుకున్న ఏకైక పార్టీగా తెలుగుదేశం నిలిచిందన్నారు సీఎం చంద్రబాబు. ఎన్టీఆర్ లాంటి వ్యక్తి మళ్లీ పుట్టరని, అలాంటి వ్యక్తి పుట్టాలంటే మళ్లీ ఎన్టీఆరే పుట్టాలన్నారు. ఆయన పేదల సంక్షేమానికి నాంది పలికిన మహానుభావుడని పేర్కొన్నారు. టీడీపీ శాశ్వతంగా ఉండాలన్నదే తన ఆలోచన అని, తెలుగు వారు ఉన్నంత వరకు పార్టీ ఉంటుందని చెప్పారు. టీడీపీని లేకుండా చేయాలని చాలా మంది ప్రయత్నించారని, అలా ప్రయత్నం చేసిన వ్యక్తులు కాలగర్భంలో కలిసిపోయారన్నారు. టీడీపీని ఏమీ చేయలేకపోయారని చెప్పారు.
తనకు అప్లికేషన్లు పెట్టుకుంటే పదవులు రావు అని క్షేత్రస్థాయిలో పని చేసిన వారికే మాత్రమే పదవులు వస్తాయని చెప్పారు.ఈ 43 ఏళ్లలో ఎన్నో ఒడిదుడుకులు చూశామని, అదే విధంగా ఎన్నో పార్టీలు ఆవిర్భవించి కనుమరుగైపోవడం కూడా చూశామని పేర్కొన్నారు. ఒక మహనీయుడి విజన్ టీడీపీ అని ఆ పార్టీకి తామంతా వారసులమని చెప్పారు.
టీడీపీ సంకల్పం చాలా గొప్పదని, పార్టీనే ప్రాణంగా భావిస్తున్న పసుపు సైన్యానికి పాదాభివందనం చేస్తున్నా అన్నారు. టీడీపీ జెండాకు ఒక అర్థం ఉందన్నారు. అన్నదాతలకు అండగా ఉండాలని జెండాలో నాగలి చెబుతుందని, కార్మికులు, పారిశ్రామిక ప్రగతికి చిహ్నంగా జెండాలోని చక్రం నిలుస్తోందన్నారు. జెండాలోని గుడిసె నిరుపేదలకు నీడ అందించాలని చెబుతోందన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ టీడీపీ అని, ప్రతి కార్యకర్తకు తప్పకుండా న్యాయం చేస్తామన్నారు.